Friday, 9 August 2013

తప్పెవరిది?

బెంగళూరు సిటి సెంట్రల్ రైల్వే స్టేషన్,సమయం నుమారుగ సాయంత్రం 6 గంటలు. ట్రెయిన్ స్టార్ట్ ఐతందుకు ఇంకా ఇరవై నిమిషాలు ఉందన్న ధీమాతోటి, విరహ గీతాలను, విషాద గీతాలను ఆస్వాదిస్తు, నాకు అన్వయించుకుంట నిమ్మలంగ నడుస్తున్న. మనిషి ఏ ఓటమినీ ఎక్కువ కాలం తలుస్కొని బాధ పడ్తందుకు ఇష్టపడడు, ఒక్క ప్రేమ విషయంల తప్ప. మనసు మోయలేని బాధల కూడ దానికి కారణమైన తన ప్రేయసిని తలుస్కొని సంతోషిస్తడు. 
మనసంతా ప్రేమను నింపుకొని, నా ప్రియురాలు తప్ప, మనుషులల్ల లింగ భేదాన్ని ఎన్నడో మర్చిపోయిన నాకు నా వయసును గుర్తు చేస్తు తారసపడ్డది ఒక అద్భుతమైన, అద్వితీయమైన అందం.  తన ముఖ వర్ఛస్సుతోటి పోటి పడలేక, అలసిపోయి ఓటమిని అంగీకరిస్తూ సూర్యుడు అస్తమిస్తున్నట్టుంది.ఈ విషయం ముందే తెలిశి, సిగ్గుపడి మబ్బుల సాటున దాసుకున్నడేమొ ఆ చంద్రుడు. ఆ అమ్మాయిని చూశిన తర్వాతనే తెలిశింది, అమ్మాయిల అందానికి పదహారణాలను(36-24-36) ఎందుకు ప్రామణికంగ వాడుతరొ. ఎంత గొప్ప కవి అయినా ఆ అమ్మాయి అందాన్ని వర్ణిస్తందుకు తన సాహిత్యం, నైపుణ్యం సరిపోవని పశ్చాత్తాప పడితీరుతడు.
అంతటి అందాన్ని చూశిన తర్వత కూడ, దానికి దాసోహం కాకుండ నా మనసు నన్ను ప్లాట్ఫారం వైపే నడిపిచ్చింది. అప్పుడు నా మీద, నా ప్రేమ మీద మస్త్ గర్వం కలిగింది. కని ఏ మూలనో తన అందం నా మనసు మీద ప్రభావం చూపిచ్చిందని గమనించలేదు నేను, గమనించినా నా ప్రేమ దానికి ఒప్పుకోనియ్యలేదేమొ. నేను కూసోవాల్సిన భోగి దగ్గరికి వచ్చిన. ఏమైందొ తెలవదు, ఎన్నడు లేనిది నేను నాతోటి ప్రయాణికులెవరని చార్ట్ వైపు చూశిన. నా పక్కనే పదహారేళ్ల అమ్మాయి, లోకం పోకడ కూడ తెలవని చిన్న పిల్ల అనుకొని రైలెక్కిన. అయినా రోజుకో రంగును మార్చే ఈ లోకం తీరు అర్థం చేసుకోవడం తల పండిన మేథావులకు కూడ సాధ్యం కాదేమొ.
రైలు కదిలింది, కాలక్షేపం కోసం నవలలు చదువుదామని నా బ్యాగ్ ని అందుకున్న. ఇంతల్నే ఎవరో అమ్మాయి వచ్చి కన్నడల "అమ్మ, ఇక్కన్నే మన సీట్లు" అంది. ఆశ్చర్యం! నేను చూశిన ఆ అపురూపమైన అందం నా పక్కనే కుసోబోతుందా! దేవుడు నా ప్రేమకు కఠిన పరీక్షను పెట్టదలశిండని నాకు అర్థమైంది. తను నా పక్కన కాకుండ ఎదురుంగ కుసున్నది. అంతటి సౌందర్యరాశి నా పక్కన కుసునె అదృష్టంగానీ, అర్హతగానీ నాకు లేవనుకున్న. తనతో పాటు వాళ్ల అమ్మ, ఇంకో నడి వయస్కురాలు(పెళ్లి చేసుకోకుండ, రాజకీయాలళ్ల ఉంటే యూత్ లీడర్ లెక్కన చలామణి కావొచ్చు) ఉన్నరు. తనని నిశితంగ మళ్లోసారి గమనించిన, వయసుకు మించిన పరువం తనది. పువ్వు లెక్కన కనిపిస్తున్న మొగ్గ ఓలె తోశింది తను నాకు. కని పూల నుంచి తేనెను జుర్రుకోవాలనే తుమ్మెదకు అంత ఙ్ణానం ఉండదేమొ.
దృష్టి మరలుద్దామని చలం వ్రాశిన మైదానం చదువుతున్న. "చూపు వీపును తాకుతుంది" అన్న కాన్సెప్ట్ ని 1927 లనే వ్రాశిన గొప్ప రచయిత అతను. పేజీలు తిప్పుతున్నప్పుడు కాకతాళీయంగ నా చూపు తన మీద పడ్డది. నా కళ్లను నేనే నమ్మలేకపొయిన. మా తల్లిదండ్రుల పెంపకం, స్త్రీల పట్ల నాకు ఉన్న గౌరవం, చివరికి నా ప్రేమను కూడ నా మతిలకి రానియ్యలేదు నా కళ్లు.
తనకు ఎదురుంగ, నా పక్కన కూసున్న తన వాళ్లతోటి మాట్లాడుతు, డైనింగ్ ప్యాడ్ ని సపోర్ట్ చేసుకొని కిటికి పక్కనే ఒంగి కూసుంది. నాగరికత పేరుతోటి పాశ్చ్యత్త వస్త్రధారణ రాజ్యమేలుతున్న ఈ జమానల, అసలే బరువైన వక్ష సంపదను కలిగిన తనకు చున్నీ ఏసుకోవడం ఇంకా బరువనిప్చిందేమొ. తను నా పక్కన కాకుండ నా ఎదురుంగ కూసున్నందుకు మిక్కిలి ఆనందం కలిగింది.
ఆ బ్రహ్మ సృష్టిల ఆడతనానికి మించిన అందం ఇంకోటి లేదు అనడం అతిశయోక్తి కాదనిపిచ్చింది. కళ్లు మూస్తె ఈ అందం మళ్లీ కనపడదేమొ అని, కల లెక్కన కరిగిపోతదేమొ అని కను రెప్పలు వాల్చడం కూడ బంద్ చేశిన. నా మనసు నా ఆధీనంల లేదు, నా శరీరం కూడ అదుపు తప్పుతుందని భయమయ్యింది. చిన్నప్పటి నుంచి ఒంట పట్టిచుకున్న విలువలు చెయ్యబట్టో, అందరి ముందు తననేం చేయలేని అసహయత చేయబట్టో, నా మనసు, తనువు చూపులతోటె సంతృప్తి చెందినయి.అడవికి రాజైన సింహం కూడ ఒందలుగా ఉన్న బర్ల మందను చూశి భయపడ్తది. నాలోపల కూడ ఒక మృగం ఉందని, ఒక స్త్రీ వల్ల అది మేల్కోగలదని ఆ రోజే తెలిశింది నాకు.
పాపం చిన్నపిల్ల, నేను తనను ఎందుకు చూస్తున్ననో, తన నుంచి ఎం ఆశిస్తున్ననో కూడ తెలుసుకోలేని వయసు తనది. కలుగుతున్న కోర్కెను నియంత్రించుకుంటదుకు నేను పడుతున్న అవస్థను గమనిచ్చిర్రో లేదా నా కళ్లల్ల రగులుతున్న వాంఛను గమనిచ్చిర్రో కని, ఆ పెద్దామె ఆ అమ్మాయిని ఒంగకుండ సక్కగ కూసొమన్నది. తను కూసుంది, కని కొంచెం ఇబ్బంది పడ్తుంది. నేను మాత్రం బయటి ప్రపంచంతోటి సంబందం లేదన్నట్టు చూపులతోటె తన అందాన్ని అనుభవించాలనే విఫల యత్నం చేస్తున్న. ఇంక లాభం లేదని వాళ్ల అమ్మ తనకో శాలువను ఇచ్చింది సుట్టుకొమ్మని. బహుశా ఎన్నడు ఆంక్షలు విధించని వాళ్ల అమ్మ ఈ రోజు ఎందుకిట్ల ప్రవర్తిస్తుందో అర్థం కాక ఆ అమ్మాయి, శాలువ పూర్తిగ కప్పుకోలేక, సక్కగ కూసొలెక ఇబ్బంది పడ్తుంది.
కొంచెం సేపైన తర్వాత, నాలోపల ఉన్న మనిషి మేల్కొని తనను ఇబ్బంది పెట్టకుడదనో, ఇంక ఏం కనిపియ్యదన్న నిరాశతోటో అప్పర్ బెర్త్ ఎక్కిన. ఎటువంటి కల్మశం లెకుండ చేశిన ఆ చర్య నాకు లాభాన్నే కలిగిచ్చింది. నాలోని మృగం మళ్లీ నిద్ర లేశింది. 
ఆ తెల్లారి, జరిగిందంత సమీక్షించి చూస్తే సమధానం దొరకని ప్రశ్నలే తప్ప, ఆవగింజంత పశ్చ్యాత్తాపం కూడ కలగలేదు నాకు.
"పురుషుడు స్త్రీని మోహించడం సృష్టి రహస్యమే తప్ప, స్త్రీని అగౌరవపరచడం కాదని, ఆ ఈశ్వరుడే మోహిని అవతారంల ఉన్న విష్ణువును చూశి పంచ తడుపుకున్నప్పుడు, మాములు మనిషిని నా వల్లేమైతుంది" అని సమర్థించుకునే నాదా తప్పు?
"తను ఎట్లుండాలి, ఎటువంటి బట్టలేసుకోవలి అనే కనీస స్వేచ్ఛను కూడ కాలరాస్తున్న ఈ మొగోళ్లే మారాలి అని దురాశపడుతున్న ఆ అమ్మయిదా తప్పు?
ఆంక్షలు, స్వేచ్ఛ... ఆటి పర్యవసానాలు, ఏది మంచి, ఏది చెడు అని తనకు తెలియజెప్పని ఆమె తల్లిదా తప్పు?

లేదా స్త్రీ పురుషుల మద్య ఆకర్షణ శక్తిని కల్గించిన ఈ సృష్టిదా తప్పు?

Thursday, 1 August 2013

మా నాయిన పాడిన పాట

నల్గొండ జిల్లా నక్రేకల్‌ల పుట్టిన.మా అమ్మ కడుపుల ఉన్నప్పుడు కేవలం మాంసాన్నే కాదు, మా మట్టి మీద ఆమెకున్న ఇష్టాన్ని కూడ పంచిందనుకుంట. నాకు గుర్తు తెల్శేటప్పటికే మా నాయిన ఊళ్లు పట్టుకొని తిరుగుతున్నడు. ఒకీలు సదివి, పెళ్లాం పిల్లలను ఒదిలేశి దేశ దిమ్మరి లెక్కన తిరుగుతున్నడు, ఈనికి ఏమన్న పిచ్చిలేశిందా అని మా నాయినను మస్త్ మంది గేళి చేశేటోల్లు. ఒక్కోసారి చీకటి పడ్డంక ఒచ్చెటోడు, పొద్దు పొడిశే లోపుల్నే పొయ్యెటోడు. కొన్ని కొన్ని సార్లు పోలిసోల్లతోటి దెబ్బలు తిని ఒచ్చేటోడు, కొన్ని సార్లు తప్పిచ్చుకొని ఒచ్చేటోడు. అప్పుడే ఇన్న మొదటిసారి తెలంగాణ అనే పదాన్ని, కని అర్దంగాక పొయ్యెటిది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నీళ్లు తెలంగాణకి రావాలని జల సాధన సమితి ఉద్యమంల తిరిగేటోడని కొంచెం పెద్దగ అయ్యింతర్వతా తెల్శింది.

ఏళ్లు గడిశినయ్. రాజకీయంగ, సామజికంగ, సాంస్కృతికంగ ఎన్నో మార్పులొచ్చినయ్. కని మా నీళ్లు మాకు రాలె, ఎన్ని బోర్లేశినా మా కండ్లళ్ల నీళ్లొచ్చేదెగని, బోర్లకెళ్లి మాత్రం సుక్క నీళ్లు రాకపొయ్యెది. ఇంకొన్నేళ్లకే మనం తాగేటి నీళ్లు మంచియి కావు, ఫ్లోరైడ్ ఉన్నది, నీళ్లు కూడ కొనుక్కోవాలె అన్నరు లేకపోతె ఫ్లోరోసిస్ ఒస్తది అన్నరు, అంటె ఎందో కూడ తెలవదప్పటికి. జర్రంత పెద్దగైన తర్వాత తెల్శింది, అప్పట్ల మా ఒదినలు ముగ్గురు కాళ్లు, చేతులు ఒంకర పొయ్యి సచ్చిపొయ్యింది చేతబడి చెయ్యబట్టి కాదు ఫ్లోరోసిస్‌తోటని. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఉన్నదే మన జిల్లాల ఐనా మనకు గీ గతేందా అనుకునెటోన్ని. అప్పుడే అనిపిచ్చింది, మన తెలంగాణ మనకు కావాలి అని, అవసరమైతె మా నాయిన నడిశిన బాటల్నె నడవాలని.

ఏంలేకపోతె తెగీడ్శి పోరాడొచ్చు, మస్తుగుంటె మనకేంది అన్న ధైర్యంతోటి కాళు దువ్వొచ్చు. కని ఉండి లేని మధ్య తరగతి బతుకులు, ఈ పొద్దుకి అసంతృప్తి తగ్గదు, రేపు మీద ఆశ సావదు. కష్టమో, నిష్టూరమో అంత దరిద్రంల కూడ నెట్టుకొనొస్తున్నం. చేతికందొచ్చిన పెద్ద కొడుకు(మా పెద్దన్న) టక్కర్ అయ్యి దావఖానల పడ్డడు. చెయ్యగలిగిందేం లేక మా నాయిన ఒచ్చి మళ్ల ప్రాక్టీస్ పెట్టిండు. చేతులల్ల జర్ర పైసలాడుడు మొదలైంది. పెద్దోల్లిద్దరి బతుకులు తడబడ్డా కింది ముగ్గురం కొంచెం మెరుగైన అవకాశాలను పొందినం. మా ఆ పరిస్థితికి సూక్ష్మంగ చూస్తె మా నాయిననే కారణం కావొచ్చు, కని స్థూలంగ ఆలోచిస్తె మాత్రం మా నీళ్లు, భూములు, వనరులు, వసతులు, ఉద్యోగాలు దోసుకున్న ఆంధ్ర రాజకీయ నాయకులది తప్పనిపిస్తది. మీరడగొచ్చు తెలంగాణ నాయకుల అసమర్థత కాదా అని! మా బలం కేవలం 119 మాత్రమే, ఈ ప్రజాస్వామ్యంల సగానికి తక్కువుంటె అల్పులమే, అసమర్థులమే.

ఇప్పటికే కిందబడి ఉన్నం, ఈ మధ్యల్నే నిలదొక్కుకుంటున్నం, మనక్కూడ మంచి రోజులొస్తున్నయ్, ఇంకా మంచిగుండాలి అన్న స్వార్దం పెరిగింది. ఐనా సరే వీలుబడ్డ ప్రతీ బంద్‌ల, నిరసనలల్ల, సకల జనుల సమ్మెల పాల్గొన్న, సాగర హారంల నేను సైతం ఒక నీటి సుక్కనైన. మా ఇంట్ల పోతున్న అని చెప్పిన ప్రతిసారి "జాగ్రత్త, మళ్లీ రా" అన్నరే తప్ప ఎన్నడు పొవొద్దన్లేదు. ఇన్నేండ్లకు కల నెరవేరబోతుంది, పురుటి నొప్పులు పడుతున్న తల్లి తీర్న "పిల్ల పుడ్తద, పీనుగెల్తదా?" అని నా మనసు తల్లడిల్లుతుంది.

నా ప్రాంతం మీద నాకున్నది ప్రేమో, పిచ్చో, పక్షపాతమో! కని నేను ఇప్పుడు నా ప్రాంతానికి మస్త్ దూరంగ బతుకుతున్న. "Are you from Andhra?" అని ఎవరన్న అడిగితె, ఆ ప్రశ్నలను తప్పిచ్చుకుంటందుకన్న సరే ఈడికెల్లి ఎళ్లిపోవాలనిపిస్తది. ఐనా సరే, నేను మా ప్రాంతంల బతకలేకనో, లేకపోతె ఈడ ఇంకా మంచిగ బతుకుత అన్న ఆశతోటో ఈడ ఉంటున్న తప్పితే, బెంగళూరుల నౌకర్ చేశి, సుంకాలు కట్టి బెంగళూరును బాగుచేద్దాం అన్న సహ్రుదయంతోటి మాత్రం కాదు. నేను వృద్దిచెందుతూ, దానికి తోడ్పడిన బెంగళూరు అభివృద్దిల పాలు పంచుకుంట దాని ఋణం తీర్చుకుందామనుకుంటున్న తప్పితె, నేను చెయ్యబట్టే, నా అసొంటోల్లు చెయ్యబట్టె బెంగళూరు బాగుపడ్డది అనే అంత ........... మాత్రం కాదు.